Sunday 31 August 2014

 గత రెండు మూడు రోజులుగా వర్షా కాలం చివరాకర్లో కురుస్తున్న చినుకులు     బాగా  జోరందుకున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వేసిన  మొక్కజొన్న పంటలు పూర్తిగా ఎండిపోయిన తర్వాత తీరిగ్గా ఇప్పుడు కురుస్తున్న ఈ వర్షాలతో మొక్కజొన్న పంటలకు ఎలాంటి లాభం లేకపోగా పత్తి పంటల విషయంలోను మరిన్ని నష్టాలకు ఇవి నాంది పలుకుతున్నాయనే చెప్పాల్సి వస్తున్నది. గత 2013 ఖరీఫ్ సీజన్ చివరి సమయంలో అకాలంగా కురిసిన ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పత్తి పంటలన్నీ నీట మునిగి రైతులకు అపారమైన నష్టం కలిగించిన విధంగానే ప్రస్తుత పరిస్థితులు దారితీయనున్నాయనిపిస్తున్నది. ఒక వైపున ఖరీఫ్ పంటల స్థితి ఉండగా, ప్రాంతంలో తెగిన కట్టల నిర్మాణానికి నోచుకోని చెరువులు, కుంటలు ఎదావిధిగా నోరు తెరుచుకొని బోసిపోయి ఉన్నయి. అక్కడక్కడ గట్టిగా ఉన్న కొన్ని చెరువులకైనా ఏమైనా నీళ్ళు వస్తాయేమోనని రైతులు కొంత ఆశలు కలిగివున్నప్పటికినీ, కల్వకుర్తి ఎత్తి పోతల పేరుతో ప్రాంతం మొత్తంలో తవ్విన కాలువలన్నీ ఆ నీటినీ మింగేసి కూర్చుంటున్నాయి. సరైన సీజనులో వర్షాలు రావు, అకాల వర్షాలతో మూతికాడికొచ్చిన పంటలు నీరుబట్టి పోతాయి. పక్కనే క్రిష్ణమ్మ ఎంత సజీవంగా పారుతున్నా వాటిని తోడుకునే ప్రాజెక్టులు పూర్తిగావు. పాలమూరు వలసల నివారనకు  దారీ అందిబాటులోకి రాదు. స్వరాజ్యమొచ్చినా అంతే ఉంది. చివరికి తెలంగాణ వచ్చినా గంతే ఉంది.     

Wednesday 20 August 2014


 ఎండలు ముదిరి పోయి  వానల జాడైనా తెలియక 

ఎండిన మక్క సేను కోసేస్తున్న రైతులు

మోకాళ్ళ ఎత్తు ఎదిగిన మక్క సేను పీకలు పెట్టడం మానేసి మొదలుకే ఎండి పోతుంటే చూస్తూ తట్టుకోలేని రైతులు గుండె రాయి చేసుకొని తన పంట సేను తానే కోసి కుప్పేసుకుంటున్నాడు. దగ్గరలో ఉన్న బర్రెల ఫారాలకు అడ్డికి పావుసేరు లెక్కన అమ్ముకుని రెండు కన్నీటి చుక్కలను రాలుస్తున్నారు. బాధనంతా లోలోపలే దాచుకుంటున్నాడు.